kishan reddy g

విమోచన వేడుకలు రాష్ట్రపతి భవన్లో తొలిసారి నిర్వహణ:కిషన్ రెడ్డి

Spread the love
  • చీఫ్ గెస్టుగా అమిత్ షా వస్తరు.. ఈసారి కూడా కేసీఆర్కు ఆహ్వానం
  • అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు
  • అన్ని పార్టీల నేతలు రావాలని కోరుతున్నట్లు వెల్లడి

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన వేడుకలను ఈసారి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రపతిభవన్లో జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. సెప్టెంబర్ 17న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదిమురు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పిస్తారని ఆయన తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రపతిభవన్లో విమోచన వేడుకలు జరగడం తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకు ఎంతో సంతోషకరమైంది. ఇదే రోజు సికింద్రాబాద్. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఉంటాయి. ఈ వేడుకలకు చీఫ్ గెస్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు. పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కు సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తూ లేఖ పంపుతాం”. అని చెప్పారు. గత ఏడాది కూడా సీఎం కేసీఆర్ను వేడుకలకు ఆహ్వానించామని, కానీ రాలేదని అన్నారు. కేంద్రం నిర్వహించే ప్రోగ్రామ్ అయినందున అన్ని పార్టీల వారు కూడా హాజరుకావాలని ఆయన కోరారు.

ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్ర

పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునే కుట్రకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తెరలేపాయని కిషన్రెడ్డి ఆరోపించారు. మజ్లిస్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, మజ్లిస్కు ఈ రెండు పార్టీలు జీ హుజూర్ అంటూ మోకరిల్లుతున్నాయని దుయ్యబట్టారు.