Screenshot 20230905 183300 Facebook

కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి

Spread the love

అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు కేంద్రమంత్రి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రభుత్వ భూములను అమ్మితేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వసతులు ఉన్నా… ప్రస్తుతం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతును రాజును చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేయకుండా.. రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేయడం సిగ్గుచేటన్నారు.

రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూర్ లో తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర రైతు సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై బొంగులూర్ లో రైతు సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రైతులకు ఉచిత ఎరువులను ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని. ఆరోపించారు కిషన్ రెడ్డి. ఉచిత హామీలను ఇవ్వడం… ఆ తర్వాత వాటిని విస్మరించడం కేసీఆర్ కు బాగా అలవాటుగా మారిందన్నారు. గత 9 సంవత్సరాలుగా టీచర్ పోస్ట్ లను భర్తీ చేయలేదని. చివరికి ఎన్నికల ముందు మాత్రం ఉద్యోగ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు కల్తీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. వ్యవసాయ ఉత్పతులకు కేంద్రం అందిస్తున్న సబ్సిడీలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ధరణి పోర్టల్ కారణంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కౌలు రైతులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రైతు చట్టాలను వ్యతిరేకించాయని చెప్పారు కిషన్ రెడ్డి, నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎరువుల కోసం రోజుల తరబడి నిలబడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితి. లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. జీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో మహిళ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.

యూపీఏ హయంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను రెట్టింపు చేసి.. రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం బీజేపీదేనని కిషన్ రెడ్డి అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మిన ప్రభుత్వం బీజేపీదని చెప్పారు. మరో 90 రోజులు బీజేపీ పార్టీ కోసం పని చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కషాయం జెండా ఎగుర వేస్తామన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కు ఓట్లు వేసినట్లేనని, బీఆర్ఎస్ కు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని… ఈ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే ఎంఐఎం పార్టీకి ఓట్లు వేసినట్లేనని చెప్పారు.