06 09 2023 BJP Flags scaled

ఎవ్వరైనా సరే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే

Spread the love

ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ బీజేపీ దృష్టి సారించింది. 4వ తేదీ నుంచి హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీంతో అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేతలు పెద్ద ఎత్తున వస్తుండటంతో బీజేపీ ఆఫీస్లో సందడి నెలకొంది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

కానీ ఇప్పటివరకు ముఖ్యనేతలెవరూ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో సీనియర్ నేతలపై తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ ప్రకాష్ జవడేకర్ సీరియస్ అయ్యారు. ఎందుకు దరఖాస్తు చేసుకోవడం లేదని ముఖ్యనేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే.. టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రకాష్ జావడేకర్ తేల్చిచెప్పారు. దరఖాస్తుల సరళిపై తాజాగా ఆయన ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపై సమాచారం తెలుసుకున్నారు. టికెట్ ఆశించిన నేతలందరూ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత గడువు పెంచే ఉద్దేశం లేదని తెలిపారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యనేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. తమకు ఎలాగూ టికెట్ అధిష్టానం ప్రకటిస్తుందనే ధీమాతో అప్లికేషన్ పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. కానీ ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధిష్టానం సూచించింది. మూడు రోజులైనా సరే ఒక్క సీనియర్ నేత నుంచి కూడా దరఖాస్తు రాలేదు. ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి మాత్రమే దరఖాస్తులు వస్తున్నాయి. వారి నుంచే ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయి. సీనియర్ నేతలందరూ బీఆర్ఎస్ కీలక నేతలపై పోటీ చేస్తారని తెలుస్తోంది. ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ కండీషన్ పెట్టింది. ఇప్పుడు బీజేపీ కూడా అలాంటి తరహా నిబంధన పెట్టడంతో.. సీనియర్ నేతలు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.