Bandi Sanjay Kumar

ఎంపీ గానా? ఎమ్మెల్యే గానా? పార్టీనే నిర్ణయిస్తది : బండి సంజయ్

Spread the love

ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? అనేది బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. అమెరికా టూర్లో ఉన్న బండి సంజయ్ నార్త్ కరోలినాలోని వార్లో హిందూ సెంటర్ లో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్ ‘ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లోనే కాదు.. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. మజ్లిస్ తో అంటకాగుతున్న బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు ఎలా సాధ్యమని, ఆ ఆలోచనకే తావులేదని స్పష్టం చేశారు.

“దేశం కుటుంబ పాలనలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో దిగజారింది. అన్నింటా అవినీతే. జవాబుదారీతనం కనిపించలేదు. దాపరికం, దళారీతనం, పైరవీలు, కోటరీలు నడిచేవి. ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్టు అప్పటి పాలకులు వ్యవహరించే వారు. కాని మోదీ పాలనలో అవినీతి ఆరోపణలు చేసే సాహసం కూడా ఎవరు చేయలేని పరిస్థితి. వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కనిపిస్తున్నది” అని వివరించారు. మోదీ చేస్తున్న అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని కోరుతున్నానని, అందుకోసం ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. దేశం కోసం నిరంతరం పాటుపడుతున్న మోదీ సర్కార్ ను మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

కేసీఆర్ ఎందుకు స్పందించరు?

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ ఖండించారు. సనాతన ధర్మాన్ని కించపరిచినోళ్లంతా. సమాధులయ్యారని మండిపడ్డారు. నిఖార్సైన హిందువునని చెప్పుకున్న సీఎం. కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. “మా పార్టీ నేతలు రాజాసింగ్, నుపుర్ శర్మలు గతంలో ఇస్లాంపై వ్యాఖ్యలు చేస్తే.. మొరిగిన గళాలు, ఇప్పుడు ఉదయనిధి విషయంలో ఎందుకు మూతపడ్డాయి. సనాతన ధర్మంపై కరుణానిధి మనవడు చెబితే వినాల్సిన ఖర్మ భారతీయులకు పట్టలేదు. సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా సరే.. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయి’ అని సంజయ్ హెచ్చరించారు. ఇప్పటికైనా ఆ కూటమి భాగస్వామ్యపక్షాలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.