బీజేపీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సోమవారం ఇంటింట తిరిగి మట్టి సేకరించారు. రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్, ఇతర పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
గోషామహల్ ట్రాఫిక్ ఎసిపి కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మొక్కలు నాటారు అనంతరం దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడినుంచి ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్ లోని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు కొనసాగారు.
వందేమాతరం రామచంద్రరావు నివాసం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యుల్ని సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు త్యాగాన్ని, వారి పోరాట స్ఫూర్తిని, వారి సేవల్ని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మనం గతేడాది, ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకున్నమని చెబుతూ దీంట్లో భాగంగానే ఈసారి ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
మనం పుట్టిన నేల.. మనల్ని కన్న దేశం పట్ల గౌరవభావాన్ని చాటుకోవడంతో పాటుగా, ఈ మట్టి మీద పుట్టి (మన ప్రాంతంలో జన్మించి) నాడు దేశ స్వాతంత్ర్యం కోసం, తర్వాత రజాకార్లతో పోరాటంలో, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ సరిహద్దులు కాపాడంటలో అమరులైన సైనికులు వారి కుటుంబాలను, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన వివిధ సాయుధ బలగాలకు చెందిన వారిని, వారి కుటుంబాలను గుర్తుచేసుకుని, వారి త్యాగాలను స్మరించుకుని, మన మట్టి గొప్పదనాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అని వివరించారు.
ఇందులో భాగంగా ఇలా ఇంటింటికీ తిరిగి మట్టిని సేకరించి దీన్ని మన సమీపంలోని ఒక పార్కులో గానీ, చెరువు వద్ద గానీ ఒక చోట చేర్చి ఈ మట్టితో మొక్కలు నాటుకోవడం జరుగుతోందని తెలిపారు. మన ప్రాంతంలో పుట్టి దేశ సేవలో అమరులైన వారిని స్మరించుకునేలా శిలాఫలకాలను ఏర్పాటు చేసుకోవాలని చెబుతూ అవి భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తిగా ఉంటాయని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఐదు ప్రతిజ్ఞలు చేయాలని కేంద్ర మంత్రి కోరారు:
- అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో నావంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాను.
- వలసవాద ఆలోచనలనుంచి విముక్తి
- ఘనమైన భారతదేశ సంస్కృతి, వారసత్వాలను ప్రోత్సహిస్తాను, ప్రచారం చేస్తాను.
- దేశ ఐకమత్యం, సార్వభౌమత్వం కోసం నిరంతర కృషి చేస్తాను.
- దేశ రక్షణకోసం, దేశాభివృద్ధికోసం త్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని, గౌరవించడం బాధ్యతగా స్వీకరిస్తాను.
ఈ శిలాఫలకాల వద్ద సెల్ఫీలు తీసుకుని..మేరీ మాటీ మేరాదేశ్ వెబ్‌సైట్‌లో పోస్టు చేయాలని కోరారు. మన పెద్దల ధైర్య సాహసాలను, శౌర్య ప్రతాపాలను, త్యాగాన్ని, మన దేశపు పవిత్రమైన మట్టి గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఈ ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమం జరుపుకుంటున్నామని వివరించారు.
ఈ మట్టి ని సేకరించి డిల్లీ వేదికగా 75 వేల మొక్కలు నాటి మహనీయుల త్యాగల్ని స్మరించుకునేలా వారి నుంచి స్ఫూర్తి పొందెందుకు అమృత వనం డిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాం అని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది భవిష్యత్ తరాలకు స్పూర్తి నిస్తుందని చెబుతూ ప్రధాని ఆలోచన మేరకుఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
మన దేశ స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను మొదలుకుని, నేటి అభివృద్ధి పథంలో ప్రయాణం వరకు ప్రతి అంశాన్నీ దేశ ప్రజలకు గుర్తుచేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని చెప్పారు.