బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్లో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్పరిధిలోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో వచ్చేది మళ్లీ మోడీ ప్రభుత్వమేనని, ఈ విషయంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికతో పనిచేసి మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్తో ప్రజలకు ఒరిగేదేం లేదని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, వాటి డీఎన్ఏ ఒక్కటేనని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్సర్కార్ వెనకడుగు వేస్తోందని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఒకటేనన్నది దీని ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై దర్యాప్తునకు తాము సిద్ధమని సీబీఐ చెబుతున్నా.. కాంగ్రెస్సర్కారు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చాలని చూస్తోందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని, ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని, తొమ్మిదిన్నరేండ్లలో లక్షల కోట్ల నిధులు మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని, జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టులు సహా ట్రైబల్ వర్సిటీ, పసుపుబోర్డు, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలలి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Leave a Reply