రాష్ట్ర బీజేపీలో అసెంబ్లీ టికెట్ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 621 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టిన గత ఐదు రోజుల్లో ఇదే రికార్డ్. తాజా దరఖాస్తులతో ఆశావహుల నుంచి వచ్చిన మొత్తం అప్లికేషన్ల సంఖ్య 1620కి పెరిగింది.
కొత్తగా అప్లై చేసుకున్న వారిలో మహబూబ్ నగర్ అసెంబ్లీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, వేములవాడ నుంచి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావు, ఆదిలాబాద్ నుంచి మాజీ జడ్పీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, పరకాల నుంచి మాజీ ఎమ్మెల్యే ములుగు బిక్షపతి, వరంగల్ వెస్ట్ నుంచి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మొదటి రోజైన సోమవారం 182 దరఖాస్తులు రాగా మంగళవారం 178 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం 306, గురువారం 333 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునే నేతల వెంట వస్తున్న అనుచరులతో బీజేపీ స్టేట్ ఆఫీసు, దాని పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.