గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఓవర్వీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజీపీ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా జరుగుతున్న పోరాటానికి ఎన్నారైలు మద్దతివ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే ప్రధాని మోడీ చలువేనని కొనియాడారు. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందన్నారు.
తెలంగాణలో అవినీతికి పాల్పడటం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని బండి ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేనప్పటికీ కేంద్రం రాష్ట్రాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులిస్తోందని చెప్పారు. ప్రవాస భారతీయులు ఎన్నికల సమయంలో కచ్చితంగా కనీసం 15 రోజుల సమయమైనా వెచ్చించి ఇండియాకు రావాలని, ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రచారం చేయాలని బండి సంజయ్ కోరారు. ఇండ్లు లేక, ఉన్నత విద్య అందక, ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో అవినీతి ప్రధాన సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు.
అవినీతిని నిర్మూలించడం తోపాటు పేదలకు పక్కా గృహ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నిరక్షరాస్యత నిర్మూలన, ఉన్నత విద్య వ్యాప్తితో పాటు తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా పలువురు తెలంగాణ ఎన్నారైలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. వీరుల త్యాగాలను మజ్లిస్ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం 1,200 మందికిపైగా బలిదానాలు చేసుకుంటే… 400 మంది మాత్రమే అని పేర్కొనడం బాధాకరమని పలువురు ఎన్నారైలు ఆవేదన వ్యక్తంచేశారు.