రాబోయే ఎన్నికల్లోనే కాదు.. ఆ తరువాత కూడా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న బీఆర్ఎస్తో పొత్తు ఎలా సాధ్యమని, ఆ ఆలోచనకే తావు లేదని ఉద్ఘాటించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా… లేదా ఎంపీగా పోటీ చేయాలా? అనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న బండి సంజయ్ కుమార్ నార్త్ కరోలినా చార్లోటేలోని హిందూ సెంటర్ లో “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ” ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి మాట్లాడారు. అలాగే ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కుటుంబ పాలనలో ఉన్నప్పుడు దేశం అన్ని రంగాల్లో దిగజారిందని, అవినీతి ఉండదన్నారు. జవాబుదారీతనం మచ్చుకైనా కనిపించలేదని, అంతా దాపరికం, దళారీలు, పైరవీలు, కోటరీ, ఇవే నడిచేవని విమర్శలు చేశారు. ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్టు అప్పటి పాలకులు వ్యవహరించే వారని బండి ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని అన్నారు. ఆర్ధిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారతన్ను 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీదేనని కొనియాడారు.
మోడీ సర్కార్‌ను మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందుకోసం రాబోయే ఎన్నికల్లో మోడీ తరపున ప్రచారం చేయాలని ప్రవాస భారతీయులను బండి కోరారు. అమెరికాలో సీనియర్ సిటిజన్‌కు ఐటీ చెల్లింపుల్లో రిబేట్ ఇస్తారని, ఇండియాలో కూడా దీనిని అమలు చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని బండి వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో.. బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, సోషల్ మీడియా మాజీ కన్వీనర్ వెంకటరమణ, అరవింద్ మోడీ, ఆనంద్ జైన్, శ్రీకుమార్ వేల్పుల, శ్యాం సుందర్ పడమటి, సుభాష్, దిలీప్ రెడ్డి, నిఖేత్ సాయి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply