డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గద్వాల ఎమ్మెల్యే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, అసెంబ్లీ కార్యదర్శి కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది.
హైకోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్ సర్కార్. ఎన్నికల సంఘ ఆదేశాలును పట్టించుకోని దౌర్భాగ్య ప్రభుత్వం. రాజ్యాంగ ప్రతిపత్తిగల సంస్థల ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు పరచని కేసీఆర్ ప్రభుత్వం.
కేసు పూర్వోత్తరాలు పరిశీలించినట్లయితే తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పేర్కొంటూ.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇదే తీర్పు కాపీని అసెంబ్లీ సెక్రెటరీకి కూడా అందించారు డీకే అరుణ. అధికారుల నుంచి స్పందన రాకపోవటంతో… ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 1,00,415 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న డీకే అరుణకు 72,155 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కృష్ణామోహన్ రెడ్డి 28,445 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడితే… డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంది.