కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంగళవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను అర్వింద్ కలిశారు. తెలంగాణలో ఎన్నికల హీట్ పెరగడం, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న వేళ అమిత్ షాను అర్వింద్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనుండటంతో.. అక్కడ నుంచి అర్వింద్ బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. కేసీఆర్పై తాను పోటీ చేయడానికి సిద్ధమని, ఆయనను ఓడిస్తానంటూ ఇప్పటికే అర్వింద్ ఛాలెంజ్ చేశారు.
ఓటమి భయంతోనే గజ్వేల్ నుంచి కామారెడ్డికి కేసీఆర్ వచ్చారని, ఇక్కడ కూడా ఆయనను ఓడిస్తానంటూ తెలిపారు. ఇలాంటి తరుణంలో అమిత్ షాతో భేటీ కీలకంగా మారింది. అయితే అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు అర్వింద్ తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి అమిత్ షాతో చర్చించానని, ఇక్కడ బీజేపీ గెలుపు అవకాశాల గురించి చర్చించినట్లు స్పష్టం చేశారు.