దేశం పేరును ‘భారత్’గా మార్చడమనేది రాజ్యాంగబద్దమేనని రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యా నించారు. భారత్ అనేది ఈ దేశం అసలు (ఒరిజినల్) పేరు అని స్పష్టం చేశారు. బుధవారం జవదేకర్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోనూ ఇదే రాసి ఉందని దానికి లోబడే పేరు మార్పు జరుగుతోందన్నారు.
శతాబ్దాలుగా ఎవరు ముందుగా దేశాలను ఆక్రమించినా వాటి పేర్లను మార్చడం జరిగిందనీ, సుదీర్ఘ చరిత్ర ఉన్న .అమెరికాలోనూ ఇది చోటుచేసుకుందని చెప్పారు. ఇక్కడికి బ్రిటీషర్లు వచ్చాక తమ ఆధిపత్యాన్ని. ప్రదర్శించేందుకు…కోల్కతా పేరును కలకత్తాగా, చెన్నైను మద్రాస్ గా, తిరుపనంతరం పేరును ట్రివేండ్రం, ముంబైను బాంబేగా మార్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు గతంలోని వలసవాద భావజాలం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
పేరు మార్పునకు, ఎన్నికలకు సంబంధం లేదు.
దేశం పేరుమార్పు అంశానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని జవదేకర్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో సనాతన ధర్మాన్నే కాకుండా దేశ ప్రజలను, అన్ని ధర్మాలను అవమానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని జవదేకర్ డిమాండ్ చేశారు..
ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేత రాహుల్
గాంధీ కూడా ఎందుకు మౌనం వహించారో చెప్పాలని
నిలదీశారు. ఈ విధంగా సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి ఆమోదమేనా అని ప్రశ్నించారు.